
- పట్టువస్ర్తాలు సమర్పించిన ఈవో, మున్సిపల్ కమిషనర్
- శివుడిని పెళ్లాడినట్లు భావిస్తూ తలంబ్రాలు పోసుకున్న శివపార్వతులు, జోగినిలు
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఎదుర్కోళ్లు కార్యక్రమం నిర్వహించగా వరుడు తరఫున ఈవో వినోద్‌రెడ్డి, వధువు తరఫున అర్చకులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరకట్నం కింద రూ. 551 కోట్లు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. తర్వాత ఈవో వినోద్‌రెడ్డి, మన్సిపల్ కమిషనర్ అన్వేశ్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ భార్య మంజుల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయ స్థానాచార్యులు నమిలకొండ ఉమేశ్‌శర్మ అధ్వర్యంలో ఈశ్వరగారి సురేశ్ నాగలక్ష్మి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించగా, అభిజిత్ లగ్నంలో ఉదయం 10.55 గంటల నుంచి 12.05 గంటల వరకు స్వామివారి కల్యాణం జరిపించారు. మంగళవారం రాత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఎలాంటి ఘటనలు జరగకుండా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లులతో పాటు ఎనిమిది మంది ఎస్సైలు బందోబస్త్ నిర్వహించారు. కల్యాణమహోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాపరామకృష్ణ, నేతలు బింగి మహేశ్ పాల్గొన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణం అనంతరం ఉత్సవమూర్తులను పట్టణంలో ఊరేగించారు.
భారీగా తరలివచ్చిన శివపార్వతులు, జోగినిలు
పార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులతో పాటు శివపార్వతులు, జోగినులు, ట్రాన్స్‌జండర్లు భారీసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణం జరుగుతున్న టైంలో తాము శివున్నే పెండ్లి చేసుకున్నట్లు భావించి, జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకున్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.